విశాఖ స్టీల్ ప్లాంట్


విశాఖస్టీల్ ప్లాంట్ ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?.


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర  ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్లు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశారు. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించారు.  “వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్ ప్లాంట్ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.


విశాఖస్టీల్ ప్లాంట్ ని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్ ప్లాంట్ నష్టాలలో ఉన్నందువలననా?  లేక ప్రభుత్వం ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా?.

నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లాఉంటారు? నిజంగా నష్టాలలో ఉందా?  నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. స్చీల్ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే.  1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్ ను ప్రారంభించి విశాఖస్టీల్ ప్లాంట్ స్ధాపన నిర్ణయాన్ని వెళ్ళడించారు. ఏడు సంవత్సరాలు ధనం కేటాయించలేదు. 1978 సం. లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. 1979 జూన్ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్ ఫర్నెస్ కు, టౌన్ షిప్ కు శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల   సామర్ధ్యంగల విశాఖ  స్టీల్ ను జాతికి అంకితం చేశారు. స్టీల్ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం పెట్టుబడులు ఆగిపోయాయి.   బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆర్ఝించింది. ప్లాంట్ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని పెంచటానికి ప్రయత్నాన్ని ప్రారంభించి సాధించారు. విశాఖస్టీల్ ప్లాంట్ సామర్ధ్యాన్ని గుర్తించి “నవరత్న “ గా గుర్తించారు. నవరత్న గా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్ 10 శాతం అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి, )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్ లో ప్లాంట్ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్ ప్లాంట్ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం తో అత్యంత ఆధునిక స్టీల్ ప్లాంట్ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ఐన “పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్ విలువ 10  కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్ ప్లాం ట్ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా?  ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.  

2 )అన్ని స్టీల్ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తుంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తుంది. స్వంత కేప్టివ్ మైన్స్ వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. స్టీల్ ప్లాంట్ లేని బ్రాహ్మణీ స్టీల్స్  కు స్వంత గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి, ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంటుకు  గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి  ప్లాంట్  అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.


విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ల వాగ్దానాలను, ఆంధ్రశాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమృతరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమృతరావు అర్ధాంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది. 


విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి సైనిక కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాతనైనా విశాఖస్టీల్ ప్లాంట్ ను ఇవ్వక తప్పలేదు.    

ఆంధ్రప్రదేశ్ అభివృధి లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే  అభివృధి సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్, ఐరన్ ఓర్ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి.

2006 సం.లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా అన్నారు. “ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్, ఐరన్ ఓర్ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి.

విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీ స్టీల్ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2  లక్షల కోట్లకు మించిన  విలువతో, 22 వేలఎకరాల  భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును ప్రపంచానికి అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను - పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది.7977 కోట్ల .రూ. ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్ విస్తరణ అప్పులకు వడ్డీ గా  18,000 కోట్ల రూ.లనుచెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది. 

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిధంగావున్నాయి.  

రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది.. 

                          ఇట్లు,

                   డాక్టర్ కొల్లా రాజమోహన్, 

          ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త..




Write a comment ...