విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు


"ఎవడు రా అమ్మేది? ఎవడు రా కొనేది? " అని ప్రజలు గద్ధిస్తున్నారు.
ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూరు శాతం అమ్మేస్తాం లేదంటారా - ఫ్యాక్టరీని మూసేస్తాం అని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటిస్తున్నారు. సోషలిస్ట్, సెక్యూలర్ అని రాసి ఉన్న రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికార పీఠం పై కూర్చున్న మంత్రులు రాజ్యాంగం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా అన్ని ప్రభుత్వ సంస్థలనూ ప్రైవేట్ పరం చేయటానికి తయారయ్యారు. ప్రభుత్వ సంస్థలు ఆధునిక దేవాలయాలని అన్న మాటలను అపహాస్యం చేస్తున్నారు. రాజ్యాంగం పీఠక లో ఉన్న సోషలిజం, సెక్యులరిజం అన్న మాటలను తలవటమే దేశద్రోహంగా చిత్రిస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం తో సంబంధం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటు పరం చేయ పూనుకున్నారు.
 ప్రభుత్వం పని వ్యాపారం చేయటం కాదు ! కాబట్టి ప్రభుత్వ సంస్థల అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారా? లేక తనవారైన గుజరాతీ కార్పొరేట్ కంపెనీలకు లేక పోస్కో కు కారుచౌకగా 
  విశాఖ స్టీల్ ప్లాంట్ ను హారతి పళ్లెం లో అమర్చి అందించాలని   అనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుపరం చేసి అమ్మతలుచుకున్నారా? లేక విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుంది కాబట్టి అమ్మాలనుకుంటున్నారా?
ఎవరి డబ్బుతో లో భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి 
1947 నాటికి ఆంధ్ర లో భారీ పరిశ్రమలు లేవు. ఏ ప్రాంతమైనా ఎదగాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. 1947 నాటికి దేశంలో భారీ పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. దేశీయ పెట్టుబడిదారులు అందరూ భారీ పరిశ్రమల జోలికే వెళ్లలేదు.రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశ అభివృద్ధికి  భారీ పరిశ్రమల అవసరాన్ని గుర్తించారు. దేశం లోని పెట్టుబడిదారులను విదేశాలలోని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సాంకేతిక, ఆర్ధిక సహకారాన్ని అర్ధించారు. స్వదేశీ, విదేశీ ప్రైవేట్ సంస్థలు భారీ పరిశ్రమల  స్థాపనకు ఆసక్తిని చూపలేదు. తమ దేశాలనుండి ఉక్కు, మందులు, ఎరువులు దిగుమతులు చేసుకోమని యూరప్, అమెరికా దేశాలు సలహాలను ఇచ్చాయి,. సోషలిస్ట్ దేశమైన సోవియట్ ప్రభుత్వం నిస్వార్ధంగా సాంకేతిక సహాయాన్నే కాకుండా ఆర్ధిక సహాయాన్ని కూడా అందించి వందకు పైగా భారీ పరిశ్రమల స్థాపనకు సహాయం చేసింది. మన దేశానికి పారిశ్రామిక పునాదిని కల్పించింది. మందులు, ఎరువులు, ఉక్కు, భారీ ఇంజనీరింగ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్,  ఐడిపిఎల్, భిలాయ్,విశాఖ ఉక్కు  కర్మాగారాలు స్థాపించారు. అప్పటికి ప్రైవేటు రంగంలో ఒక టాటా స్టీల్ మాత్రమే ఉండేది. ప్రభుత్వం భారీ పరిశ్రమలు స్థాపించిన తర్వాత దేశ పెట్టుబడిదారులు పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా కొన్ని పరిశ్రమలు స్థాపించడం ప్రారంభించారు. భారత దేశo పారిశ్రామికంగా కొంత అభివృద్ధిని సాధించిన తరువాత ఆ ఫలాలను అనుభవించటానికి దేశ, విదేశీ పెట్టుబడిదారులు తయారయ్యారు. ఆశ్రిత పెట్టుబడి ప్రబలంగా ఉన్నటువంటి ఈ రోజున భారత దేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మేమిద్దరo మాకిద్దరు అంటూ ప్రభుత్వ నాయకులిద్దరూ ఇద్దరు బడాపెట్టుబడిదారులతో జత కలిపారoటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వెస్ట్ ఇండియా కంపెనీ వెలిసిందoటున్నారు. విశాఖ ఉక్కు ఈ వెస్ట్ ఇండియా కోరల్లో చిక్కుకోవటం యాదృచ్ఛికం కాదు. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి లాభాల వేటలో పడింది. వడ్డించిన విస్తరి లాగా భారత దేశ పరిశ్రమలను కారు చౌకగా కొట్టేయటానికి రెడీ గా వున్నాయి. మూడు లక్షల ఇరవై  కోట్ల విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ముప్పైయ్ లక్షలకు అమ్మేస్తాం లేదా మూసేస్తాం అంటూ ద్రవ్యపెట్టుబడికి లొంగిపోతున్నారు,
4889కోట్ల పెట్టుబడితో ప్రారంభించి 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే - సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా?
విశాఖ ఉక్కు నష్టాలలోలేదు. 
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాలలో  ఉన్నదన్న ప్రచారం వాస్తవమేనా? వాస్తవం కాదు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటివరకు కూడా పెట్టినటువంటి పెట్టుబడి 4889 కోట్ల రూపాయలు. హిందూ పత్రిక అంచనా ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత ఆస్తుల విలువ  మూడు లక్షల 20 వేల కోట్ల పైనే ఉంటుందని అంచనా. 4889కోట్ల పెట్టుబడితో 3.2 లక్షల కోట్ల ఆస్తులను పొందడం అంటే- సంస్థ నష్టాల్లో ఉందా లాభాల్లో ఉందా?
ప్లాంట్ విస్తరణకు ప్రభుత్వం ఏమైనా ధన సహాయం చేసిందా? ప్లాంట్  విస్తరణకు 
 ప్రభుత్వం పైసా ఇవ్వలేదు.  ప్లాంటు విస్తరణకు   కావలసినటువంటి ధనాన్ని తమ కష్టంతో వచ్చిన  సొంత  లాభాలతో  సమకూర్చుకున్నారు . ఇంకా కావలసి వస్తే   బ్యాంకు నుండి  అప్పు తీసుకున్నారు. టాటా స్టీల్ కంపెనీ కి 8 శాతo వడ్డీ రేటు కి బ్యాంకు లు అప్పులు ఇచ్చాయి. విశాఖ ఉక్కు కి 14 శాతం వడ్డీ రేటు ప్రకారం అప్పులు ఇచ్చారు. విశాఖ ఉక్కు సంస్థ క్రమం తప్పకుండా 14 శాతం వడ్డీ రేటు తో బ్యాంకు కిస్తీ
లను చెల్లించింది.. 12 లక్షల టన్నుల ఉత్పత్తి నుండి 63 లక్షల ఉక్కు  ఉత్పత్తిని సాధించారు.72 లక్షల టన్నులఉత్పత్తిని సాధించటానికి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 2 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి స్థాయికి చేరుకోగల సామర్ధ్యం ఉంది. దేశ అభ్యున్నతికి కి విశాఖ ఉక్కు ను వనరుగా ఉపయోగించుకుని ప్రగతి ని సాధించ వచ్చని  విశాఖ ఉక్కు  నిరూపించింది. ప్లాంట్  నష్టాల్లో కూరుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని నష్టాలలో కూరుకుపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టలేమని విడ్డూ  రపు ప్రకటనలు చేస్తున్నారు 
లాభాలు ఎందుకు తగ్గాయి?
హుదూద్ తుఫాన్ వలన స్టీల్ ప్లాంట్ కు 1000 కోట్ల నష్టం సంభవించింది. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సహాయం చేయలేదు.
రాజకీయ అవసరాల కోసం రాయాబే్రీలి, లో రైల్ వీల్ ఫ్యాక్టరీలో 2 వేల కోట్ల రూపాయలను పెట్టమని విశాఖ స్టీల్ ను ప్రభుత్వం ఆదేశించింది.ఫలితంగా 2వేల కోట్ల రూపాయల ను  స్టీల్ ప్లాంట్ నష్ట పోయింది.
గనుల కోసం, ఒరిస్సా లోని OMDC ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 381 కోట్ల రూ.వాటాల ను ప్రభుత్వం కొనిపించింది. పర్యావరణ అనుమతుల కోసం మరో 500 కోట్లను ఖర్చు పెట్టించారు. మొత్తం 881 కోట్ల రూ. స్టీల్ ప్లాంట్  ధనం ఖర్చు పెట్టించారు. కానీ గనులు లోంచి ఇనుప ఖనిజం రాలేదు.
2010 లో బర్డ్ గ్రూప్ లో 361 కోట్లను పెట్టుబడిగా పెట్ట్టి 51 శాతం వాటాలు కొనమని కేంద్రం ఆదేశించింది.వాటాలు కొని 10 ఏళ్ళైనా, నేటికీ ఒక్క టన్ను ఇనప ఖనిజం కూడా రానివ్వలేదు.చెయ్యని నేరానికి 1400 కోట్ల అపరాధ రుసుము విధించారు. ఇప్పటికే 500 కోట్లు చెల్లించారు. ఈ విధంగా 861 కోట్ల సొమ్ము వృధా అయ్యింది. 
1971 లో విశాఖ ఉక్కు ను SAIL సంస్థ క్రింద ప్రారంభించారు. సెయిల్ సంస్థకు, 200 సం.తవ్వినా తరగని ఇనప గనులున్నాయి. సెయిల్ సంస్థ నుండి విశాఖ ఉక్కు ను ఎందుకు విడకొట్టారు? 1982 లో ఏ ప్రయోజనాలను ఆశించి విశాఖఉక్కు ను RINL (రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్ ) క్రిందకు తెచ్చారు? సెయిల్ లో ఎందుకు విలీనం చేయరు? 
గత మూడు నాలుగు సంవత్సరాలను ఫోకస్ చేస్తూ అంతకుముందు ప్లాంట్ సాధించిన అద్భుత ఫలితాలను విస్మరించడం  సమంజసం కాదు. 279 కోట్ల అమ్మకాలతో మొదలై  2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లకు పైగా అమ్మకాల తో సాలీనా 14.5 శాతం వృద్ధిరేటును సాధించింది. 14.5 శాతం వృద్ధి రేట్ను సాధించిన మరొక ఉక్కు ఫ్యాక్టరీ ని చూపించమనండి.
స్వంత గనులు ఎందుకు కేటాయించలేదు? 
ఉక్కు తయారీకి వంద రూపాయలు ఖర్చు అయితే అందులో 61% కేవలం ముడిపదార్థమైన ఇనుపఖనిజం  కొనటం  కోసమే ఖర్చవుతున్నది. స్టీల్ ప్లాంట్ ఖర్చులో సింహభాగం ఇనుప ఖనిజాన్ని కొనడం కోసమే వెచ్చించవలసివస్తున్నది. సొంత గనులు ఉంటే ఈ ఖర్చు తగ్గటమే కాకుండా విశాఖ ఉక్కు లాభాల బాటలో ప్రయాణించేది. DPR అంటే వివరమైన ప్రాజెక్టు రిపోర్ట్ ను ఏం యన్ దస్తూరి కం పెనీ 1971 లో తయారు చేసింది. అందులో బైలాదిల్లా ఇనుప ఖనిజ గనుల్లో 4 & 5 బ్లాకులను కేటాయించాలని చాలా వివరంగా ప్రాజెక్టు రిపోర్ట్ లోనే నివేదించారు. అయినా ఇప్పటివరకు కేప్టివ్ మైన్స్ , అంటే స్వంత గనులను ఎందుకు కేటాయించలేదు? ఇప్పటివరకు అధికారంలోఉన్న అన్ని ప్రభుత్వాల నాయకులు ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉక్కు ఉత్పత్తి ప్రారంభించిన 1991 నుంచి మార్కెట్ రేటుకి ఇనప ఖనిజాన్ని కొనక తప్పటంలేదు. 1991 లో టన్ను ఇనప ఖనిజం రేటు 396. రూ. ఉంటే,2004 సంవత్సరానికి 1085 రూ, 2020 కి 4779 రూ.అయింది.మధ్యలో  5424. రూ.కి కూడా  పెరిగింది.
స్వంత గనులున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ( SAIL) ప్రతి టన్ను ఇనప ఖానిజానికి 2396 రూ ఖర్చు పెడుతూవుంటే, విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్ను ఇనప ఖనిజానికి 6584 రూ. ఖర్చు పెట్టవలసి వచ్చింది. అంటే స్వంత ఇనప గనులు లేనందున విశాఖ ఉక్కు సంస్థ ప్రతి టన్నుకూ అదనంగా 4188 రూ ఖర్చు పెట్టి ఉక్కు ను ఉత్పత్తి చేసింది. ఉక్కు ఫ్యాక్టరీ లు లేని బ్రాహ్మణి స్టీల్స్ కు, గాలి జనార్ధనరెడ్డి కి  గనులను కేటాయించారు. జిందాల్, ఎస్సార్,వంటి ప్రైవేట్ సంస్థలకు కూడా ఇచ్చారు. స్వదేశీ ప్రభుత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్ కు ఇనప ఖనిజ గనులు ఇవ్వలేదు కానీ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయ ప్రభత్వ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? ఎందుకు ఇవ్వలేదు? ఉత్పత్తి పరమైననష్టం లేదు. ఆపరేషన్ నష్టాలు లేవు. పెట్టుబడికి అయిదు రెట్లకు మించి లాభాలను ఆర్జించింది.కేంద్ర ప్రభుత్వానికి 43 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెండ్ల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్ల రూపాయలు పన్ను చెల్లించారు.అయినా ఎందుకీ సవతి తల్లి ప్రేమ.
ఇనప ఖనిజం బయట కొన్నా 2014- 15 వరకూ లాభల్లో నడిచింది. 
2020 డిసెంబర్ లో 212 కోట్ల లాభం వచ్చింది.
2021 జనవరిలో 135 కోట్ల లాభం వచ్చింది.
2021 ఫిబ్రవరి లో 165 కోట్ల లాభం వచ్చింది.
2021 మార్చ్ లో 300 కోట్ల లాభం రావచ్చoటున్నారు.
నష్టాలు వస్తున్నాయానే అబధాన్ని సృష్టించి పదే పదే వల్లించి నిజం చేసే ప్రయత్నము లో భాగమే ఈ కుతంత్రం. 
ప్రైవేట్ వారికీవిశాఖ ఉక్కు ను ఇవ్వటానికే స్వoత గనులను కేటాయించలేదు అని అర్ధ మౌతూనే ఉంది.
ప్రభుత్వాలు విశాఖ ఉక్కు సంస్థ కు ఇనప గనులు కేటాయించి ఉంటే ఈ అదనపు ఖర్చు అంతా లాభంగా మారేది.
నష్టాల్లో ఉన్న గుజరాత్ పెట్రోల్ కార్పొరేషన్ ను ONGC లో కలిపేశారు. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ సంస్థ లో కలపవచ్చు కదా! సెయిల్ సంస్థకు  200 సం. వరకు లభ్యమయ్యే ఇనప ఖనిజ గనులున్నాయి.పూర్తి లాభా లతో ఉత్పత్తి చేయవచ్చు.
గుజరాత్ కి ఒక న్యాయం!ఆంధ్ర కొక న్యాయమా? ఒకే దేశం ఒకే న్యాయం అవసరం లేదా?
కార్మికులకు జీతాలు ఎక్కువ--
 పని తక్కువ అని మరొక అపవాదు
కార్మికులకు జీతాల ఖర్చులు ఎక్కువ అని, కార్మికులు సరిగ్గా పని చేయరనీ అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఖర్చులో  ఉద్యోగుల వేతన ఖర్చు 15 శాతానికి ఎప్పుడూ మించలేదు. విపరీతమైన ఉష్ట్నోగ్రత లో, ప్రతికూల వాతావరణంలో కూడా కార్మికులు శ్రమించి. ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉత్పత్తిని పెంచుతూనే ఉన్నారు.
ప్రిఫరెన్షియల్ షేర్ లను ఉపహరించడం వలన షేర్ కాపిటల్ ను తిరిగి ఇవ్వవలసి వచ్చింది.  ఫలితంగా ప్లాంట్ పై 2930 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. గత 30 సంవత్సరాల నుండి  నికర ఆస్తులు పెంచుకుంటూ,  ప్రిఫరెన్సియల్  షేర్స్ డబ్బులు ఇచ్చేస్తూ, అప్పులు వడ్డీతో సహా తీరుస్తూ, ఉక్కు ఉత్పత్తిని 63 లక్షల టన్నులకు పెంచుకుంటూ  అప్రతిహతంగా పురోగమిస్తున్న విశాఖ ఉక్కును అప్రతిష్ట పాలు చేయలేరు.   
 కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఎత్తిన    బావుటా దించేది లేదని ఆంధ్ర ప్రజలు, కార్మికులు ముక్తకంఠంతో తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఎంత మొండి గా ఉందో కార్మికులు, ప్రజలు కూడా అంతే పట్టుదల తో ఉన్నారు. జనవరి 27న కేంద్ర క్యాబినెట్ కమిటీ విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ చెయ్యాలని నిర్ణయించిన తర్వాత కార్మికులంతా ఐక్యం అయ్యారు. కార్మిక సంఘాలన్నీ కలిసాయి.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ గా ఏర్పడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం తో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ మెయిన్ గేట్ ముందు ప్రారంభించిన నిరాహార దీక్ష శిబిరం  ప్రజలతో కిక్కిరిసిపోతూ వున్నది. "ఎవడు రా అమ్మేది? ఎవడు రా కొనేది? " అనే నినాదంతో ప్రభుత్వాన్ని  గద్ధిస్తున్నారు.
 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంతటా  ప్రతిధ్వనించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించేవరకూ పోరాడాలన్న ఉక్కు సంకల్పం తో  పోరాడి సాధించారు. వీధులు, గ్రామాలు, పట్టణాలు, హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు,  కళాశాలలు, పరిశ్రమలు, పార్లమెంటు, శాసనసభ అన్నీ పోరాట వేదికలుగా మార్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ విస్తరించిన సమరశీల పోరాటం ప్రతిఫలమే విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్షిణ్యాల వలన రాలేదు. ప్రజా పోరాట చరిత్రను పాలకులు మరిచిపొతే చరిత్రహీనులు కాక తప్పదు. ఆ పోరాటమే తిరిగి దారిన పడుతున్నది. నూతన శక్తీతో కార్మికులు, రైతులు ఐక్యమై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఎదుర్కొంటున్నారు. ప్రజా శక్తి ముందు ఎంతటి 
వారైనా తల వంచక తప్పదు.  
డాక్టర్ కొల్లా రాజమోహన్,
ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.
    5..03..2021.  గుంటూరు        
   
 

Recipient inbox full

Your message couldn't be delivered to Venkat.chittipati@gmail.com. Their inbox is full, or it's getting too much mail right now.LEARN MORE

The response was:

552 5.2.2 The email account that you tried to reach is over quota and inactive. Please direct the recipient to https://support.google.com/mail/?p=OverQuotaPerm j10sor1164662ejs.66 - gsmtp


---------- Forwarded message ----------
From: Rajamohan Kolla <kollarajamohan@gmail.com>
To: Chitipothu Haribabu <haribabu.nu@gmail.com>, mannavahariprasad@gmail.com, Maosiyang Manam <maosiyangmanam@gmail.com>, Venkat Chittipati <Venkat.chittipati@gmail.com>
Cc: 
Bcc: 
Date: Wed, 31 Mar 2021 16:56:29 +0530
Subject: 
----- Message truncated -----


Write a comment ...