దారుణ మారణహోమం


దారుణ మారణహోమానికి బాధ్యత ఎవరిది?


కరోనా మొదటి వేవ్ తోనే విలవిల్లాడిన ప్రజలు రెండవ సారి వచ్చిన కరోనా వేవ్ ను తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన భయం, ఆందోళన తో జీవిస్తున్నారు. హాస్పిటల్ లో బెడ్స్ దొరకక, ఆక్సిజన్ లేక, మందులు అందుబాటులో లేక, హాస్పిటల్ ఖర్చులు, మందుల ధరలు భరించలేక సగం చచ్చిపోతున్నారు. మరణించినవారికి శ్మశానం లో కూడా చోటు దొరకటంలేదు. శ్మశాన వాటికలో ఖర్చులుకూడా పెరిగి బ్రోకర్లు చేరి పాకేజీలు ప్రవేశపెట్టారు.

కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన  కీలకమైన ముడిపదార్ధాల ఎగుమతులపై నిషేదాన్ని ఎత్తి వేయమని కోరిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అభ్యర్ధనను అమెరికా ఫ్రభుత్వం నిరాకరించింది. “ మా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడుకోవలసిన బాధ్యత మా ప్రభుత్వం పై వుంది. అమెరికా కంపెనీలు దేశీయ వినియోగానికి ప్రాధాన్యత నివ్వాలనేదే ఇక్కడి చట్టం “ అని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మీడియాతో చెప్పాడు.

తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపకపోతే....ప్రతీకారం ...తీర్చుకుంటామని ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించిన  కొద్ది సేపటికే తీవ్ర ప్రభావిత దేశాలకు ఇన్ఫెక్షన్ నివారణకోసం మాత్రలను అందచేస్తామని భారత్ ప్రకటించింది. మన దేశాన్ని బెదిరించి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తీసుకు వెళ్లిన అమెరికా, మన కవసరమయిన కరోనావాక్సిన్ ముడిపదార్ధాలు ఇవ్వడానికి నిరాకరించింది. డెమోక్రాటిక్ పార్టీ లోని ఇండియన్ అమెరికన్ల ఒత్తిడివలన, ప్రపంచ ప్రజాభిప్రాయం తరువాత వాక్సిన్ ముడిపదార్ధాలను ఇవ్వటానికి అంగీకరించారు. కోవిడ్,-19 వైరస్ సకల మానవాళికి ఉమ్మడి శత్రువు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంఘీభావం, పరస్పర సహకారం అవసరం. ఇందుమూలంగా అమెరికా ప్రభుత్వ నైజం అర్ధమౌతుంది.అమెరికా స్వార్ధపూరిత వైఖరి ని దాచుకుందామన్నా దాగటంలేదు. జర్మనీ, బ్రిటన్, రష్యా, చైనా అన్ని దేశాలతోపాటుగా సహాయాన్ని అందించక తప్పలేదు.


దేశంలో ఆరోగ్యం అత్యవసర పరిస్థితిని అధిగమించటానికి  సార్వత్రిక, సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి. మసూచి,బీ సీ జీ, అన్ని టీకాలూ అందరికీ ఉచితంగా ఇవ్వటం ఇప్పటిదాకా అనుసరించిన పవిత్రమైన సాంప్రదాయం. పోలియో, యం యం ఆర్, పెంటావేలెంట్ వాక్సిన్ వరకూ  అన్ని కేంద్రప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేది. ఉన్నతమైన సంప్రదాయన్ని విచ్చిన్నం చేసి వేలాదిమంది మరణాలకు కారణమయ్యే నీచ ప్రయత్నం సర్వదా గర్హనీయం. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యతను నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలను వ్యాక్సిన్ కొనుక్కోమని కూడా చెప్తున్నది.

విశాఖ ఉక్కును ప్రైవేట్ కు కట్టబెట్టివుంటే , ఆక్సిజన్ కు అంతులేని ధరలు పెట్టేవారు. కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే చావండి అనేవారు. తెలుగు ప్రజలు త్యాగంతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఔదార్యంతో ఆక్సిజెన్ ఇచ్చి అనేక రాష్టాల్లోని ప్రజల ప్రాణాలను నిలుపుతున్నది. ప్రాణాలను నిలిపేది సమాజ శ్రేయస్సు కోరేప్రభుత్వ సంస్థలేనని ఇప్పటికయినా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ మందుల కంపెనీలు ఐ డీ పీ యెల్ ఉంటే రెండేసివీర్ ఇంజక్షన్ అతి తక్కువ ధరకు లభ్యమయ్యేది. వేల రూపాయల్లో  బ్లాక్ మార్కెట్ సాగే అవకాశం ఉండేదా?

కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు


 కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా ప్రభుత్వం దగ్గర పేటెంట్ ఆర్డరు వేయించుకుని అంతులేని ధనార్జనకు పూనుకుంటున్నారు.. అంటే పేటెంటె తీసుకుంటారు. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకొంటున్నారు.

కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వాలి 


డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు తెలిసో తెలియకో ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్ ఇవ్వటానికి అవకాశంవున్నది. 1970 పేటెంట్ చట్టం సెక్షన్ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్ లో అందుబాటులో లేకపోతే పెటెంట్ ఆఫీసర్ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్స్ ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మార్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్ కంపెనీలకు ఎదురొడ్డి నిలిచేదెవరు. మన దేశంలో ఒకరున్నారని నిరూపించారు. 


సెక్షన్ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చునని చట్టం లో ఉంది.. చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు  పేటెంట్ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది. 


మార్చ్ 2012 న ఇండియన్ పెటెంట్ ఆఫీసర్ శ్రీ పీ హెచ్ కురియన్ ధైర్యంగా ప్రజలకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. మొదటిసారీ ఆఖరుసారీ ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్  ఆర్డరును ఇచ్చి శ్రీ పీ హెచ్ కురియన్ చరిత్రలో నిలిచారు.  భారతదేశంలో నెలకు సరిపోయే  నెక్సావార్ మందును రూ.8800. కు అమ్మేటట్లుగానూ బేయర్ కంపెనీ కి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్ పేటెంట్ యాక్ట్  క్రింద పేటెంట్ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది. 


సోరాఫెనిబ్ ( బ్రాండ్ నేమ్ ..నెక్సావార్) అనే లివర్ ,కిడ్నీకేన్సర్ మందును బేయర్ కంపెనీ తయారు చేసి మన దేశంలో అమ్ముతున్నది. అందుకు బేయర్ కంపెనీకి 1970 పేటెంటె చట్టం ప్రకారం హక్కులున్నాయి. ఆ కేన్సర్ మందును వేరెవరూ తయారుచేయకూడదు. అమ్మకూడదు .  నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేల కు అమ్ముతున్నది. పేటెంటు చట్టం పేరున ప్రపంచ ప్రజలను పీక్కు తింటున్నారు. రీసర్చ్ ఖర్చులు ఒకటి రెండు సంవత్సరాలలోనే వసూలు చేసుకొంటున్నారు.  మందు తయారీ ఖర్చుకు కొన్ని వేల రెట్లు అధికంగా 20 సంవత్సరాలు వసూలు చేస్తున్నారు. ఒక టన్ను ముడిసరుకును కొని మిల్లీ గ్రాముల పరిమాణంతో బిళ్ళలు , ఇంజక్షన్లు తయారుచేసి ఇష్టమొచ్చిన ధర కి అమ్ముకుంటున్నారు. కోట్లమంది ప్రజలను పేదరికంలోకి నెట్తున్నారు. 

2లక్షల80 వేల మందును రూ.8800. కు అమ్మేటట్లుగా  కంపల్సరీ లైసెన్సింగ్

  రూ 2లక్షల80 వేల మందును రూ.8800. కు అమ్మేటట్లుగా  కంపల్సరీ లైసెన్సింగ్ మొదటిసారి గా ఇండియన్ పేటెంట్ ఆఫీసు, సెక్షన్ 84(1)  ప్రకారం నాట్కో కంపెనీకి అనుమతించింది, 50 ఏళ్ళ పేటెంట్ చట్టం చరిత్ర లో ప్రజల మేలుకోసం ఇచ్చిన తీర్పు ఇదే. అత్యవసర పరిస్ధితులలో  ” కంపల్సరీ లైసెన్సు “ ఇవ్వవచ్చు. కరోనా మహమ్మారి కిమించి అత్యవసర పరిస్ధితి ఏమున్నది.? ప్రభుత్వం, మందుల కంపెనీలు కంపల్సరీ లైసెన్సును తీసుకోవచ్చు కదా. పేటెంట్ చట్టం ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? రెండేసివర్ మందును, కోవాక్సిన్, కోవిషిల్డ్ వాక్సిన్లను కంపల్సరీ లైసెన్స్ క్రిందకు తీసుకురావచ్చు. కరోనా బాధితు లందరికీ కరోనా మందులను, వాక్సిన్లను అందించి ప్రాణాలను కాపాడ వచ్చు. ఈ అవకాశాన్ని మందుల కంపెనీలు, ప్రభుత్వం ఉపయోగించుకుని ప్రజలను కరోనానుండి కాపాడే అవకాశాన్ని వినియోగించుకోవాలి.


ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్-19 కి కాకపోయినా వైరస్ వ్యాధులైన సార్స్ , మెర్స్, ఎబోలా, ఇన్ ఫ్లూయంజా. హెపటైటిస్-సీ, హెచ్.ఐ.వీ. వ్యాధుల కోసం కొన్నిమందులను అభివృధిచేశారు. కోవిడ్-19 ని కట్టడి చేయటంలో ఆశించిన ఫలితాలు ఏ ఒక్కమందులోనూ లేవు. కొత్త మందులేవీ  కనుగొనబడలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు.  పాత మందులకు కొత్త ఇండికేషన్స్, రీ పర్పస్ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్ ట్రయల్స్ చేసి పాత పేటెంటె మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది. 


రెమిడెసివిర్ 


అమెరికాకు చెందిన గిలియాడ్-బయోఫార్మస్యూటికల్స్ కంపెనీలకు రెమిడెసివిర్ పై పేటెంట్ హక్కులున్నాయి. ఒక దశాబ్దం క్రితం కనిపెట్టిన రెమిడెసివీర్ అనేమందును మొదట హెపటైటిస్ చికిత్సకు అభివృధిచేశారు. ఆఫ్రికా లో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. ఎబోలా వ్యాధిని తగ్గించటంలో మందుగా ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్ లో దుష్పలితాలేమీ కలగనందున  కోవిడ్-19 చికిత్స లో క్లినికల్ ట్రయల్స్ మొదలెట్టారు. 

ఎబోలావ్యాధి తగ్గకపోయానా, మందు పనిచేసినా చేయకపోయినా  గిలియడ్ కి వున్న పేటేంట్ హక్కు పోలేదు. వీలైన చోట తయారు చేయించుకొనటానికి, ఇష్టమొచ్చిన రేటుకి ఎక్కడైనా అమ్ముకోవటానికి పేటెంట్ చట్టం అవకాశ మిచ్చింది.   రెమిడెస్విర్  జనరిక్ మందును తయారు చేయటానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. ఆ మందును తయారుచేయటానికి హైదరాబాద్ కు చెందిన హెటిరో , సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ కాడిలా  కంపెనీలతో గిలియాడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నది . కోవిఫర్ COVIFOR బ్రాండ్ పేరున  100 మి.గ్రా.ఇంజెక్షన్ల  ను విడుదలచేసారు. దీని ప్రకారం ఈ ఔషదాన్ని తయారుచేసి మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది. 


 రెమ్డెసీవీర్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్ లోడ్ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కరోనాకి మేజిక్ మందుకాకపోయినా, మృత్యువు నుండి కాపాడలేకపోయినా కొంత ప్రయోజనాన్ని సైంటిస్టులు గుర్తించారు. కోలుకోవడానికి సమయం తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. ఆసుపత్రి లో వుండవలసిన కాలం 15 రోజులనుండి 11 రోజులకు తగ్గింది. 


రెమిడెసివీర్ ఎవరికి ఎలా ఇవ్వాలి  1)  కరోనా వ్యాధి వచ్చిన రోగి ఆసుపత్రిలో అత్యవసర విభాగం (ఐసీయూ) లో డాక్టర్ల పర్యవేక్షణలో వుండాలి.  ఆక్సిజన్ సాచ్యురేషన్ 94 శాతం కన్నా తక్కువ వుండాలి. 2) ఆక్సిజన్ సహాయం పై సీరియస్ గా వున్న రోగులకు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ పై మందును ఇంట్రా వీనస్ ఇంజంక్షన్ గా ఇవ్వాలి. 3) రెమిడెసివిర్ 100 మి.గ్రా.ల ఇంజెక్షన్  ఐ వీ ఫ్లూయిడ్ ద్వారా నరానికి ఇవ్వాలి. మొదటి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు రోజుకి ఒక్కసారి ఇవ్వాలంటున్నారు. వ్యాధి తీవ్రంగా వుంటే మరో ఐదు రోజులు అంటే మొత్తం 10 రోజులు ఇంజెక్షన్లు ఇవ్వాలి.


అయిదురోజుల చికిత్సకు రెమిడెసివీర్ మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్ మార్కెట్లో కొన్ని రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. వందల రూపాయలకు ఇవ్వవలసిన   ఒక డోసు మందును రూ. 30,000 వేలనుండి లక్ష వరకూl.అమ్ముతున్నారు. విమానాలలో విదేశాలు తిరిగి మన దేశానికి వచ్చినవారు కరోనా వ్యాధిని అందరికీ పంచారు. ధనవంతులు వైద్యాన్ని  కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో మృత్యువాత పడుతున్నారు.


 పేటెంట్ హక్కు ఉన్నగిలియాడ్ సైన్సెస్ అనే అమెరికన్ కంపెనీ  రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్ మందులన్నీ అమెరికాకే ఫస్ట్ ఇవ్వాలని ట్రంప్ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అన్నాడు. మా సంగతేంటని యూరప్ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్ మందును ఇంజెక్షన్ గా తయారుచేయటానికి 3 డాలర్లు ఖర్చవుతుంది. 3000 డాలర్లకు కంపెనీ అమ్ముతున్నది.


స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు మాస్క్ కాపాడింది.


వంద సంవత్సరాలక్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. భారత ప్రజలలో 6 శాతంమంది మరణించారు. ప్రపంచంలో 3 వ వంతు ప్రజలకు సోకి 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేను మాస్క్ ధరించనన్నాడు. మాస్క్ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచంలోకరోనా కేసుల లెక్కలలో 3,647,715 కేసులతో అమెరికాకు ప్రధమ స్ధాన్నాన్నిసాధించాడు.  బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్ ధరించనన్నాడు. ప్రపంచంలోకరోనా కేసుల లెక్కలలో2,046,328 కేసులతో బ్రెజిల్ కు ద్వితీయ స్ధాన్నాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు. కొత్తగా రోజుకి 3లక్షల 79 వేల కేసులతో భారత్ కూడా రికార్డ్ ని స్థాపించింది.


 UNIVERSAL HEALTH & UNIVERSAL IMUNISATION. అందరికీ వైద్యం, అందరికీ టీకాలు


స్పానిష్ ఫ్లూ  తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( UNIVERSAL HEALTH )  అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రా లను నేర్పి  చైతన్యపరచింది.  దేశంలో ‘లుముంబా ‘ యూనివర్సిటీని స్ధాపించి ప్రపంచ పేద విద్యార్ధలను డాక్టర్లుగా తీర్చిదిద్దింది. ఆ ఒరవడిలో పయనిస్తూ  ELAM  లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్  1999 లో క్యూబాస్ధాపించింది. ప్రపంచ పేద విద్యార్ధలను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నది.   ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా ఎక్కడ వైద్య కార్యకర్తలు అవసరమైతే అక్కడికి డాక్టర్లను పంపుతుంది..క్యూబా లాంటి సోషలిస్ట్ దేశాల్లో పరిశోధలనకు ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. బయోటెక్నాలజీ లో అధ్బుత విజయాలను సాధించి. ప్రపంచంలోమొదటిసారిగా మెనింజిటిస్ -బీ, మెదడు  జబ్బుకి వాక్సిన్ తయారు చేసింది. ఎం ఎమ్ ఆర్  వాక్సిన్ ను క్యూబా తయారు చేసి భారతదేశం తో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు అతి చౌకగా అందించిన ఘనత కాస్ట్రో ప్రభుత్వానికే దక్కింది. హవానా లోని ఫినిలే ఇన్స్టిట్యూట్ లో  5 కరోనా వాక్సిన్ల అభివృద్ధి లో పురోగతిని సాధించారు. అందులో రెండు వాక్సిన్ లు మూడవ  దశ పరిశోధనలో వున్నాయి. 44 వేల మంది వాళ్లంటీర్లు చివరి దశ పరిశోధనలలో పాల్గొంటున్నారు. 1,24,000 ఆరోగ్య కార్యకర్తలకు ఈ వాక్సిన్ ని ఇచ్చారు.వాక్సిన్ విజయవంతమ యిందని ఎండాకాలం లోపల దేశ ప్రజలందరికీ వాక్సిన్ వేస్తామని ఫినిలే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దగ్మార్ గారిసియా రివేరా  చెప్పారు. ఇరాన్, వెనిజులా దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాక్సిన్ అతి చౌకగా ఉంటుందనీ, 46.4 డిగ్రీలు వేడి లోనైనా రిఫ్రిజరేటర్ లేకుండా ఉంచవచ్చని క్యూబన్ అధికారులు తెలిపారు.

పేరులోకూడా ప్రతాపం

" soberana" అనే రెండు వాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశ లో వున్నాయి.

"సోబేరణ" అంటే అర్ధం "సార్వాభౌమాధికారత ". మూడవవ్యాక్సిన్ పేరును  క్యూబా విప్లవ వీరుడు జోసె మార్తి రాసిన గేయం పేరున "ABDALA" అబ్డాలా అని పెట్టారు. MAMBISA మామ్బిసా అని ముక్కు లో స్ప్రే ద్వారా ఇచ్చే వాక్సిన్ కు స్వాతంత్రం కోసం పోరాడిన గెరిల్లా పేరును పెట్టి వారి స్వాతంత్ర అభిలాష ను విప్లవ స్ఫూర్తి ని చాటుకున్నారు.మేక్సికో, అర్జెంటీనా,లాంటి లాటిన్ అమెరికా , ఆఫ్రికా దేశాలు వ్యా క్సిన్ పట్ల ఆసక్తిని చూపుతున్నాయి. వందల మిలియన్ డోస్ లకు ఆర్డర్లు ఇస్తున్నారు. 

ఒక చిన్న దేశం తమ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచప్రజల ఆరోగ్యం కోసం అత్యంత ప్రేమతో, దీక్ష తో కృషి చేస్తుంది. అమెరికా ఆంక్షలవలన క్యూబా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రధాన పంట అయిన చక్కెర ను ఎవరూ కొనకుండాఆంక్షలు విధించి ఎగుమతిచేయనీయటంలేదు. మరొక ఆదాయ వనరు టూరిజం. టూరిస్టులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించి క్యూబా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నది. అయినా ప్రజల ప్రాణాలను కాపాడటంలో క్యూబాముందుంది.

ప్రాణం విలువ ఏమిటో నిర్వచించారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుని మొత్తం ఆస్తి కన్నా మానవుని ప్రాణం విలువైనది" అని క్యూబా వైద్య విధానాన్ని రూపొందించిన  చే గువేరా అన్నారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకులు, సైంటిస్టులు ప్రపంచానికి కావాలి.

 వైరస్ వలన వ్యాప్తి చెంది వేలాదిమంది పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే పోలియో జబ్బుకి వ్యాధినిరోధక మందును డాక్టర్ జోనాస్ సాల్క్ 1955 లో కనుగొన్నారు. తన పరిశోదనకు పేటెంట్ అడగ లేదు. 1955, ఏప్రిల్ 12 న పత్రికా విలేఖరి ముర్రో, “ పోలియో వాక్సిన్ పై పేటెంట్ ఎవరిది” అని డాక్టర్ సాల్క్ నిఅడిగితే  “ప్రజలది’ అని చెప్తూ “ సూర్యుని పేటెంట్ చేయగలమా” అన్నారు.పేటెంట్ పేరున ధనం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్న కార్పొరేట్ మందుల కంపెనీలు, బ్లాక్ మార్కెట్ లో మందులను అమ్మేవారు లేని వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్ధలేనపుడు పేటెంట్ చట్టం లో వున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలి.


  అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్ హెల్త్ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, చైనా, న్యూజిలాండ్,కేరళ  లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు  సైంటిస్టుల మాటలను విన్నారు. తూ చా తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు. అందువలననే ఆ దేశాలలో  ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.    


కోవిడ్ -19 గురించి 2019, డిసెంబరు 30 న చైనా ప్రపంచ ఆరోగ్యసంస్ధ,  పది రోజులలో కరోనా జెనిటిక్ మాప్ (జన్యు పటం) ని వాక్సిన్ పరిశోధన కొరకు ప్రపంచ సైంటిస్టులకు అందించింది. ఆ రోజు నుండీ సైంటిస్టులు వ్యాక్సిన్ కనిపెట్టటానికి అహోరాత్రులు కష్టపడి అమెరికా, చైనా, రష్యా లలోవ్యాక్సిన్ కనుగొన్నారు.ఇంకా పరిశోధనలు జరుగుతూనేవున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ  రానున్న మహా విపత్తును గూర్చిఅన్ని దేశాలనూ హెచ్చరించింది. విదేశీ ప్రయాణీకుల నియంత్రణ, క్వారంటైన్, వైద్య పరికరాలు, వైద్యులకు ఆధునిక రీతులపై శిక్షణ లపై దృష్టి సారించమంది. సమయం వృధా అయ్యింది. 2020, ఫిబ్రవరి 24,25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని భారత ప్రభుత్వం ఆహ్వానించి లక్షలాదిమంది ప్రజలను ఒక చోట చేర్చి భారీ సభను నిర్వహించారు.  కరోనాని ఆహ్వానించారు. మధ్యప్రదేష్ లో ప్రభుత్వాన్ని కూలదోసే రాచక్రీడ లో బిజీ గా వున్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ 2020, మార్చ్ 22 న ప్రజా కర్ఫ్యూ విధించి పళ్లాలు మోగించి కొవ్వొత్తులు వెలిగించి కరోనాని శపించారు. నాలుగు గంటల వ్యవధినిచ్చి , మార్చ్ 24 నుండీ లాక్ డౌన్ విధించారు. వలస కార్మికులు నిరుద్యోగులయి, తిండీ తిప్పలు లేకుండా కొన్ని వేల మైళ్ళు నడిచి ఆప్తబంధువులను కోల్పోయి పుట్టినఊరుకు జీవఛ్ఛవాలుగా చేరారు. ఎన్నికలు, పదవులు, కుంభమేళాలు ప్రజల ప్రాణాలకన్నాముఖ్యమయ్యాయి.కరోనా వ్యాధిని అడ్డంపెట్టుకుని రైతువ్యతిరేక చట్టాలను ఆమోదింపచేసుకున్నారు. నిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకున్నారు.


కరోనా రహస్యం

ఎబోలా, హెచ్ ఐ వీ, ఏవియన్ ఫ్లూ, నిఫా, స్వైన్ ఫ్లూ, సార్స్, మెర్స్, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్న జూనోటిక్ వ్యాధుల్లో  ఈ రహస్యం దాగివున్నది. ఈ రకమైన వైరస్ వ్యాధులతో  1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు  మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివృధి పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్ లు , వన్యజీవులు స్ధానభ్రంశం  చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్ లు అల్లకల్లోలం సృష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి. 

విలువలు లేని వ్యవస్ధ

ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు.   ప్రకృతిని నాశనం చేసిన కార్పోరేట్ శక్తులు అంటువ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు.  ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా?  రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ కరోనాని ఎదుర్కోవటానికి ప్రజలు, మీడియా పూనుకోవాలి. డబ్బులు లేకపోతే మందులు లేవు,బెడ్ లేదు,  ఆక్సిజన్ లేదు, వ్యాక్సిన్ లేదు అనే  వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తేవాలి.

UNIVERSAL HEALTH, UNIVERSAL IMUNISATION కావాలి. ప్రజలందరికీ వైద్యం, వాక్సిన్లు అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

29-04-2021                                          ఢాక్టర్ కొల్లా రాజమోహన్. 

                                                                 నల్లమడ రైతు సంఘం, గుంటూరు


Show quoted text


Write a comment ...